జరిగిన కథ


వుద్యోగవేటలో పట్నం చేరిన వెంకటరత్నం, గురు మామయ్య దగ్గర అర్థ ఆర్థిక పాఠాలు నేర్చుకుంటూ వుంటాడు. అందులో భాగంగా మామయ్య రెజ్యూమే తయారు చెయ్యటం, ఆర్థిక మాంద్యం, షేర్లు, స్టాక్ మార్కెట్ పనితీరు, సత్యం కంప్యూటర్స్ భాగోతం, బ్యాంకులు పనిచేసే విధానం, ఇంటర్వ్యూ చిట్కాలు, క్రెడిట్ కార్డుల వివరం చెప్పాడు. వెంకట రత్నానికి వుద్యోగం దొరికింది, మమయ్యకి పెళ్ళి కుదిరింది. జే.ఎఫ్.ఎం విరామం తరువాత మామయ్య కొత్త కథ మొదలు పెట్టాడు. "ఎకనమ దేశంలో సంక్షోభం" కథ ద్వారా ఆర్.బీ.ఐ చేసే పనులు వివరించాడు. ఎలక్షన్ జరిగిన రోజు చంద్రబాబు నగదు బదిలీ గురించి వివరించాడు. ఆ తరువాత పర్సనల్ ఫైనాన్స్ గురించి ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి చెప్పసాగాడు మామయ్య. అందులో మొదటగా లైఫ్ ఇన్సూరెన్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రిస్క్-రివార్డ్‌ల గురించి చెప్పి, ముదుపు చేయడానికి కొన్ని టెక్నిక్‌లు నేర్పించాడు.

13.9.09

కార్పొరేట్ కాశీమజిలీ కథలు - 37

"నేను వుద్యోగం మారదామనుకుంటున్నాను" అన్నాను నేను ఒక రోజు. అప్పటికి నేను క్రెడిట్ కార్డ్ కంపెనీలో చేరి పది నెలలైంది.

"అదేమిటిరా.. ఇప్పుడున్న వుద్యోగం బాగానే వుంది కదా.. మారటం ఎందుకు?" అన్నాడు మామయ్య.

"కాదు మామయ్యా ఇంత కంటే మంచి ఆఫర్ వచ్చింది. ఇన్స్యూరెన్స్ కంపెనీలో.. అదీ కాక మా బాస్‌తో కూడా నాకు పడట్లేదు.." చెప్పాను చేతులు నులుముకుంటూ.

"సరే.. అసలు ఎవరినా వుద్యోగం ఎందుకు మారతారో తెలుసా.."

"అంతకంటే మంచి వుద్యోగం దొరికినప్పుడు.."

"అలాగనే అందరూ అనుకుంటారు.. కానీ నిజం కాదు. ఇంత కంటే మంచిది అంటే ఏమిటి? మంచి జీతమా? ప్రొఫైలా?.. అదలా వుంచితే.. అసలు వున్న వుద్యోగం వదలడానికి కారణం ఏమిటి అనేది ముఖ్యం. ఈ కారణాలన్నింటిని రెండుగా విభజించ వచ్చు - ఒకటి పుల్ ఫాక్టర్, ఇంకొకటి పుష్ ఫాక్టర్. తెలుగులో చెప్పాలంటే ఆకర్ష - వికర్ష."

"ఇదేదో కాంగ్రేస్ మీద ప్రతిపక్షం చేస్తున్న విమర్శలా వుంది.." అన్నాను నేను నవ్వుతూ.

"అలాంటిదే - ముందు ఆకర్ష గురించి చెప్తాను. ఇప్పుడు అనేక జాబ్ సైట్లు, కన్సెల్టెన్సీలు వచ్చాయి కాబట్టి ఆకర్ష బాగా పనిచేస్తోంది. వాళ్ళు నీ రెస్యూమె ఎక్కడో చూసి నీకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు వున్న వుద్యోగం కన్నా "మంచి" వుద్యోగం వుంది చేస్తావా అని అడుగుతారు.. అయితే ఈ మంచి ఏమిటి అనేది నీ ఇంట్రస్ట్ మీద ఆధారపడి వుంటుంది. దాని గురించి ఒక చిన్న పిట్ట కథ -

మామయ్య చెప్పిన జాబ్ సైట్ల కథ: ఆకర్ష వికర్ష..!!

ప్రస్తుతం బాగా ప్రముఖంగా కనిపించే జాబ్ సైట్లు మూడు - నౌక్రి.కాం, మాన్స్టర్.కాం, టైంస్‌జాబ్స్.కాం. ఈ మూడు జాబ్ సైట్లు ఇచ్చే ప్రకటనలను జాగర్తగా గమనిస్తే, అసలు ఎవరైనా జాబ్ ఎందుకు మారతారు అనే విషయం అర్థమౌతుంది.
నౌక్రి.కాం ప్రకటనలో ఒక దుర్మార్గుడైన ఆఫీసర్ వుంటాడు. అతను పేరు హరి సాడు. చిరాకైన ముఖం, కాగితాలు విసిరేసే నైజం చూస్తే ఇతని దగ్గర పని చెయ్యడం కన్నా ఏ జట్కా బండో, బజ్జీల బండో నడుపుకుంటూ బ్రతకడం నయం అనిపిస్తుంది. సదరు ఆఫిసరుగారు ఒక హోటల్లో "పూల్ సైడ్" టేబుల్ రిజర్వ్ చేసుకుంటూ పేరు చెప్తే అవతలి వ్యక్తికి అర్థం కాదు. ఆ ఫోను సబార్డినేట్ అందుకోని - ఎచ్ ఫర్ హిట్లర్, ఏ ఫర్ అరోగెంట్, ఆర్ ఫర్ రాస్కెల్, ఐ ఫర్ ఈడియట్ అంటూ తన బాస్ పేరుని నిర్వచిస్తాడు.


ఇక రెండొవది మాన్స్టర్.కాం ప్రకటన. ఇందులో ఒక డాన్సర్ విమానశ్రయంలో పని చేస్తుంటుంది, ఒక క్రికెటర్ బ్యాట్‌తొ బట్టలు వుతుకుతుంటాడు, ఒక చెఫ్ సెలూన్‌లో పని చేస్తుంటాడు. మాన్స్టర్.కాం లోగో అయిన మాన్స్టర్ వచ్చి వీరందరిని వారి వారి వృత్తులకు సరిపోయే వుద్యోగంలో నిలబెడుతుంది. క్రికెటర్‌ని క్రికెట్ మైదానంలో, చెఫ్‌ని హోటల్‌లో ఇలాగన్న మాట.

మూడొవది టైంస్‌జాబ్.కాం - ఇందులో ఒక వుద్యోగిని అనేక సంధర్భాలలో అతని బాస్, ఇతర వుద్యోగులు తెగ పొగిడేస్తుంటారు. ఇంద్రుడివి చంద్రుడివి అంటూ మునగ చెట్టు ఎక్కిచ్చేస్తూ వుంటే మనవాడు వుబ్బిపోయి కొండంత అయిపోతాడు. నెల ముగిసి జీతం తాలూకు పేయ్‌స్లిప్ చేతికి అందగానే తుస్స్ మంటూ కొండంత వాడు గోరంతైపోతాడు.

ఈ మూడు ప్రకటనలు, వుద్యోగం మానెయ్యడానికి వుండే మూడు ముఖ్య కారణాలకు గుర్తులు. మొదటిది బాస్ నచ్చకపోవడం వల్ల, రెండొవది సరైన అవకాశం లేదా ప్రొఫైల్ కోసం మూడొవది జీతం పెరగడం కోసం. ఈ ముడింటిలో నన్నడిగితే రెండొవ కారణం సబబైనదిగా కనిపిస్తుంది. మూడొవదైన జీతం తరువాత, బాస్ కారణంగా వుద్యోగం మారటం అంత సబబైనది కాదేమో అనిపిస్తోంది." అన్నాడు మామయ్య.

"ఇంకొంచెం వివరంగా చెప్పు మామయ్యా?" అన్నాను.

"చూడు రత్నం, ఎవరైనా వుద్యోగంలో చేరినప్పుడు తను భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాడో ఒక అవగాహన వుండాలి. ఆ అవగాహనే అతని కెరీర్‌కి దారి చూపిస్తుంది. వుదాహరణకి నువ్వు మరో అయిదేళ్ళ తరువాత ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో సెల్స్ రంగంలో మంచి పొజిషన్‌కి వెళ్ళాలని ,అనుకుంటే నువ్వు చేసే వుద్యోగాలు, ముందు ముందు నువ్వు చదవబోయే చదువులు దానికి సంబంధించే వుండాలి. అలా కాకుండా క్రెడిట్ కార్డ్ కంపెనీ నుంచి కాల్ సెంటర్‌కి అటు నుంచి సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళి మళ్ళీ ఏ ఇన్సూరెన్స్ కంపెనీలోనో ఆపరేషన్స్ వుద్యోగం చేసి అక్కడినుంచి మ్యూచువల్ ఫండ్ కంపెనిలో సేల్స్ వుద్యోగానికి వెళ్తే - ఎవ్వరూ తీసుకోరు. అందువల్ల నీ కెరీర్ ఎలా వుండాలని కోరుకుంటావో అలాంటి వుద్యోగమే చేసేందుకు ఎప్పుడూ ప్రయత్నించాలి. మాన్స్టర్.కాం ప్రకటనలో చెప్పే విషయం అదే

ఇక జీతం సంగతి - జీతం ఎంత కావాలి అన్న విషయమై ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం వుంటుంది. అయితే సామాన్యంగా ఇది లైఫ్‌స్టైల్ మీద ఆధారపడి వుంటుంది. ఒకసారి ప్రాధమిక అవసరాలకు సరిపోయే జీతం రావటం మొదలయ్యాక ఆ తరువాత ఖర్చంతా లైఫ్‌స్టైల్‌కే కదా. కాబట్టి అక్కడి నుంచి పెరిగే జీతం కేవలం లైఫ్‌స్టైల్‌ని మరింత మెరుగు పరుచుకోవడానికే వుపయోగపడుతుంది. నా లాంటి వాడికి జీతం పెరిగితే ఏం చేస్తాడు? మహా అయితే తాగే వోడ్కా బ్రాండు మారుతుంది.. స్మిరనాఫ్ నుంచి అబ్సల్యూట్‌కో మరిన ఖరీదైన బ్రాండులకో మారుతుంది.. మామూలు పెన్ను మానేసి పార్కర్ కొంటాం, బ్రాండెడ్ బట్టలే వేస్తాం.. ఇలాగన్న మాట. ఇవన్నీ తప్పని నేను చెప్పటంలేదు. కాకపోతే ఇందాక చెప్పిన కెరీర్‌ని పణంగా పెట్టి లైఫ్‌స్టైల్ మెరుగు పరుచుకోవాలనుకుంటే అది తప్పే. కొంత మంది నాకు తెలిసిన మిత్రులు ఆర్నెల్లకొకసారి జీతం పెరుగుతోందని వుద్యోగాలు మారుతూ పోయి నాలుగేళ్ళలో ఏడు వుద్యోగాలు మారాడు. చివరి వుద్యొగం అతనికి సరిపడక వేరే చోటకి మారదామని ఎంత ప్రయత్నించినా వుద్యోగం దొరకలేదు. అప్పటికే అతని సీవీ అన్ని కంపెనీలల్లో రెండు చక్కర్లు కొట్టింది - మనవాడు చక్కర్లు కొట్టిన సంగతీ అందరికీ తెలిసిపోయింది.

మూడొవది - హరి సాడు లాంటి బాస్‌తో వేగలేక వుద్యోగలు మారేవారు. మన దేశంలో ఈ విషయం గురించి ఎవరైనా అధ్యయనం చేశారో లేదో తెలియదు కాని, నాకు తెలిసినంతలో చాలామంది ఇదే కారణం చెప్పి వుద్యోగలు మానేస్తారు. ఇది ఎంత తప్పు? నువ్వెళ్ళిన కొత్త వుద్యోగంలో అక్కడి బాస్ ఇంతకంటే దుర్మార్గుడు అయితే అప్పుడేమి చేస్తావు? లేదూ నువ్వు వుద్యోగం మానేసిన వెంటనే నీ పాత బాస్ కూడా వుద్యోగం మానేస్తే నీకు ఎంత బాధ కలుగుతుంది."

"అవును మామయ్య నువ్వు చెప్పిన విషయం కరెక్టే" అన్నాను నేను.

"ఇప్పుడు చెప్పు నువ్వు వుద్యోగం మారాలనుకుంటున్న విషయం ఎంతవరకు సబబు?" అడిగాడు మామయ్య

"కొంత వరకు సబబే - బాస్ ఎక్కువగా వత్తిడి పెడుతున్నందుకే మానేయ్యాలనుకుంటే అది తప్పే. కాని ఈ సంవత్సరం క్రెడిట్ కార్డ్లు అమ్మే వుద్యోగంలో అంత గొప్ప బిజినెస్ ఏమి చెయ్యలేక పోయాను. అందువల్ల ప్రమోషన్ వచ్చే అవకాశాలు తక్కువగా వున్నాయి. అదే వేరే వుద్యోగంలోకి వెళ్తే ఒక మెట్టు పైన ఇస్తారు కదా.. ఆ రకంగా నైనా ప్రమోషన్ వస్తునదని అనుకున్నాను. జీతమూ పెరుగుతుంది."

"అదుగో మళ్ళీ జీతం పెరుగుతుంది - ప్రమోషన్ రాలేదని అలక - ఈ రెండిటిమీదే ఆధారపడి నిర్ణయం తీసుకో వద్దు. ఒక్కట్టి గుర్తు పెట్టుకో ముఫై నలభై సంవత్సరాల కెరీర్‌లో ప్రమొషన్ లేని సంవత్సరాలు కనీసం ఒక పదిహేనైనా వుండవా? ప్రతి సంవత్సరం ప్రమోషన్లు రావాలని, త్వర త్వరగా కార్పొరేట్ లేడర్ ఎక్కేయాలని అనుకోవడం పొరపాటు. అప్పుడప్పుడు లోయలో దిగితేనే కదా కొండ ఎక్కే అవకాశం వచ్చేది.. ఏమైనా సరే కెరీర్ దృష్టిలో పెట్టుకోని మంచి నిర్ణయం తీసుకో.." చెప్పాడు మామయ్య.

"సరే ఆలోచించి చెప్తాను.." అన్నాను.

"ఈ విషయం గురించి నన్ను కాకుండా ఇంకెవరినైనా అడిగావా?" అడిగాడు మామయ్య.

"అడిగాను"

"వెరీ గుడ్.. నువ్వు ఎవరెవరిని అడిగావో నాకు తెలుసు చెప్పమంటావా?" అన్నాడు.

"ఏది చెప్పు చూద్దాం" అన్నాను వుత్సాహంగా.

"సామాన్యంగా వుద్యోగాలు మారటం లాంటి ముఖ్యమైన కెరీర్ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రతివొక్కరు కొంతమందిని సలహా అడుగుతారు.. అలా అడగటం తప్పేమి కాదు. అందులో మొదటి రకం కుటుంబ సభ్యులు - తండ్రి, తల్లి, భార్య లేదా భర్త.. వీళ్ళ సలహా ఎక్కువ శాతం కెరీర్ ఆధారంగా కాక వ్యక్తిగత, కుటుంబ ఇబ్బందుల ఆధారంగా వుంటాయి. తరువాత స్నేహితులు.. ఇందులో కూడా ప్రస్తుతం చేస్తున్న వుద్యోగంలో కొలీగ్స్, చెయ్యాలనుకుంటున్న కంపెనీలో పనిచేస్తున్న స్నేహితులు వుంటారు.. తరువాత ముఖ్యంగా గతంలో తమ పైన బాసుగా వున్న వ్యక్తిని ఒక్కడినైనా అడుగుతారని ఒక పరిశీలన. వీళ్ళందరినీ కలిపి పర్సనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. నీ కెరీర్‌లో ఎంతమంది పర్సనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో నువ్వు చేరగలిగితే అంత సక్సెస్ అయినట్టు..."

"ఇదేదో బాగుందే మామయ్యా.. అయితే ఒక్క విషయం.."

"ఏమిటి"

"నా పర్సనల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో నీకు పర్మనెంట్ పోస్ట్.."

"హ హ.. ఆలోచించి నిర్ణయించుకో.." నవ్వుతూ వెళ్ళిపోయాడు మామయ్య.

(తరువాత: డబ్బులు మిగలట్లేదేం.?)

Read more...

తెలుగువారమండి...



సందర్శకులు

మీరీ బ్లాగుకి కొత్తా..?

నేను గతంలో రాసిన హాస్యదర్బార్ మొదటి నించి చదవాలంటే ఇక్కడ నొక్కండి

కార్పొరేట్ కాశీమజిలీ కథలు మొదటి నించి చదవాలంటే ఇక్కడ నొక్కండి

వీరతాడు..

  © Blogger template Psi by Ourblogtemplates.com 2008

Back to TOP